త్రిత్వ సిద్ధాంతమును గ్రహించటానికి స్పష్టతతో కూడిన లోతైన పఠనము

అభినందన
త్రిత్వము క్రైస్తవ మూల సిద్ధాంతము. త్రిత్వము క్రైస్తవ్యానికి ఆయువు పట్టు. తండ్రి కుమార పరిశుద్ధాత్మలలో ఎవరు దేవుడు కాకపోయినను బైబిల్ అర్థరహితమౌతుంది, మనము విశ్వాస భ్రష్టులమౌతాము. దేవుడు ఒక్కడే. తండ్రి కుమార పరిశుద్ధాత్ములుగా ఉన్నాడు. ఐతే తండ్రి కుమారుడు కాదు, తండ్రి పరిశుద్ధాత్మ కాదు. అలాగే కుమారుడు పరిశుద్ధాత్మ కాదు, తండ్రి కాదు. అలాగే పరిశుద్ధాత్మ తండ్రి కాడు, కుమారుడు కాడు. ఐనప్పటికీ ముగ్గురు దేవుళ్ళు లేరు. వీరు ఏక కాలములో ఉన్నారు, ఒకే సారాన్ని కలిగి ఉన్నారు, సమానముగా ఉన్నారు (Co-Exixting, Co-Essential and Co – Equal).
బైబిల్ ను కలిపి చెరపక, స్వంత వ్యాఖ్యానాలు చేయకుండా ఉంటేనే త్రిత్వ సిద్ధాంతం అవగతం అవుతుంది. ప్రతి వక్ర బోధ (CULT) త్రిత్వముచుట్టూ పరిభ్రమిస్తూ ఉంటుంది. త్రిత్వమును గురించి క్రైస్తవులమని చెప్పుకునే వారిలో చాలా భిన్నాభిప్రాయాలున్నాయి, అపోహలూ ఉన్నాయి. సహోదరుడు ప్రవీణ్ ఈ అపోహలను తొలగించే ప్రయత్నం చేశాడు. భిన్నాభిప్రాయాలను సరిదిద్దే ప్రయత్నం చేశాడు.
త్రిత్వాన్ని నమ్మనివాడు క్రైస్తవుడు కాడు. మేము త్రిత్వాన్ని నమ్ముతాము అంటారు కానీ ఏమని నమ్ముతారో వారికే తెలియదు. మనము త్రియేక దేవునిని గూర్చి ఏమి నమ్ముతున్నామో అదే మన నిత్యత్వాన్ని, మన దైనందిన జీవితాన్ని, దేవునితో మన సంబంధాన్ని నిర్ణయిస్తుంది, నిర్దేశిస్తుంది. ఆది కాండము మొదలు ప్రకటన వరకు 66 పుస్తకాలు గల పరిశుద్ధ గ్రంధము త్రిత్వాన్ని గురించి ఏమి బోధిస్తోందో ఆ బోధను సహోదరుడు క్రైస్తవ లోకానికి అందించేందుకు చేసిన ప్రయత్నం అభిలషణీయం, అభినందనీయం. ఈ చిన్న పుస్తకం మిమ్ములను ఆలోచింపజేస్తుంది, అనుసరించేట్లుగా చేస్తుంది.
అనేక మంది ప్రపంచఖ్యాతినార్జించిన నవీన కాల బోధకులు త్రిత్వ సిద్ధాంతాన్ని భ్రష్ఠుపట్టించి, క్రైస్తవలోకాన్ని గందరగోళ పరచి, చీకటిలోనికి త్రోసివేసి తమ మనసుకు నచ్చిన విధానాలలో తమకు అనుకూలమైన వాటిని బోధిస్తూ క్రైస్తవులను దారి మళ్ళిస్తున్నారు. త్రియేక దేవుడు అనుగ్రహించిన పరిశుద్ధ లేఖనాలకు తమ లేఖనేతర ప్రత్యక్షతలను (External Scriptural Revelations) జోడించి, విశ్వాసులను విశ్వాసభ్రష్ఠత్వములోనికి లాగేసే మంచి దుర్బోధకుల బోధను గ్రహించలేక పోతున్న క్రైస్తవులకు ఈ పుస్తకము ఒక మార్గదర్శి, ఒక జ్యోతి. దుర్బీధల విషానికి ఒక విరుగుడు. బైబిల్ యొక్క లోపరాహిత్యం కొరకు పోరాడే రోజులు పోయి, బైబిల్ అన్నికాలాలకు, అన్నితరాలకు చాలినది అని పోరాడవలసిన రోజులలో మనం ఉన్నాం.
సహోదరుడు ప్రవీణ్ ప్రతి క్రైస్తవుడు చదివి తీరాల్సిన పుస్తకాన్ని క్రైస్తవ సమాజానికి అందించినందుకు అతని జీవితం ధన్యమైనది. దేవుడు సహోదరుడు ప్రవీణ్ ని ఆశీర్వదించి, ఇతరులకు ఆశీర్వాదకరముగా నిలుపునుగాక!
Rev & Dr. M. జోషి లీలన్ రెడ్డి
డైరెక్టరు – ఇండియా థియొలోజికల్ సెమినరీ. B.Sc, B.Ed. M.Min. M.C.S, Phd

పరిచయవాక్యములు

ఈ పుస్తకము లో బైబిల్ బోధించే అద్వితీయ త్రియేక దేవుని గురించిన ఙ్ఞానము క్రమబద్ధంగానూ మరియు సమగ్రంగానూ వివరించబడింది. త్రిత్వ సిద్ధాంతమును గ్రహించటానికి స్పష్టతతో కూడిన లోతైన పఠనము అత్యావసరము. పుస్తక రచయిత ఈ సిద్ధాంతమును సామాన్యులకు అర్థమయ్యేలా సరళముగా మరియు వేదాభ్యాస లోతులను పలచబరచకుండా తనదైన శైలిలో వ్యక్తపరచారు. పలు అన్య మతాలు మరియు త్రిత్వము పై అవగాహన లేని, క్రైస్తవులని చెప్పుకునే గుంపులు లేవనెత్తే ప్రశ్నలకు ఈ పుస్తకము సరైన సమాధానములనిస్తుంది.
రచయిత బైబిల్ బోధలోనూ మరియు చర్చలలోనూ అనుభవము గలవాడు. ఈ నేపద్య కారణంగా త్రిత్వ సిద్ధాంతమును వేదశాస్త్ర పరిధిలో తాత్వికంగా వ్యక్తపరిచాడు. ఈ పుస్తకము క్రైస్తవ విశ్వాసమును ఇప్పుడిప్పుడే అనుసరిస్తున్నవారికి పునాదిగాను, బైబిల్ బోధకులకు వారి బోధనాంశములలోనూ, తమ ప్రశ్నలకు సమాధానాలు వెదుకుతున్న నిజమైన సత్యాన్వేశకులకు సమాధానముగాను అలాగే విమర్శకులు క్రైస్తవ సిద్ధాంతమునకు లోబడేలా చేసేందుకు, ఉపయొగపడుతుంది.

డా. P. జాన్ పాల్ B. Tech, M. Tech, PhD
డైరెక్టర్ – ఎజ్రా బైబిల్ కాలేజ్
డైరెక్టర్ – ది ఇంజినీరింగ్ అకాడమీ

ముందుమాట
కార్నర్ స్టోన్ మినిస్ట్రీ వారు ప్రచురించిన ఈ పుస్తకము, త్రియేక దేవుని వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోవడంలో ఒక మైలు రాయి. క్రైస్తవ సంఘములో అనేక శాఖలు ఉన్నా వాటన్నింటినీ ఐక్య పరిచేది విశ్వాస ప్రమాణమే (Basic Doctrine). దానిలో ముఖ్యమైనది త్రిత్వము. విశ్వాస ప్రమాణాల నుండి వైదొలగే వారిని తప్పుడు బోధకులు (Heretics) అంటాము.
“త్రిత్వం శిరసా నమామి” అనే ఈ శ్రేష్ఠమైన ఈ పుస్తకము చాలా క్లిష్టమైన త్రిత్వ ప్రమాణాన్ని సులువైన విధంగా అర్థం చేసుకోవడానికి ఉపయోగ పడుతుంది. త్రిత్వం అంటే ముగ్గురు దేవుళ్ళు కాదు అదే సమయములో ఒకే దేవుడు మూడు విధాలుగా ప్రత్యక్షమవడమూ కాదు. మూడు వేర్వెరు వ్యక్తులు ఒకే దైవములో లీనమై ఉండడం.
బైబిల్ లో దేవుడనే మాటకు “ఎలోహ్ ఇమ్” అని వ్రాయబడింది. ‘హిమ్’ బహువచనాన్ని సూచిస్తుంది, (తెలుగులో “లు” వలే) కానీ వాక్యము ఏక వచనములో ఉంది. అంటే ఒకే దేవునిలో బహుళత్వము ఉంది. దానిలోని ఒక వ్యక్తిత్వము అతీతునిగా (Transcendental) ఉన్నాడు. ఆ వ్యక్తిత్వాన్ని ‘యెవడును ఎప్పుడైనను చూడలేదు’ (యోహాను 1:18). తండ్రి రొమ్మున నున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయల్పరచాడు. పాత నిబంధనలో దేవుని వాక్కుగా (యోనా 1:1) దేవుని దూతగా (నిర్గమా 3:2) యెహోవాగా ప్రవక్తలకు ప్రత్యక్షపరచుకున్నాడు. ‘ పురాతన కాలము మొదలుకొని శాశ్వత కాలము ప్రత్యక్షపరచుకున్న’ దేవుడే బెత్లెహేములో యేసుగా జన్మించాడు(మీకా 5:2). ఆదికాండము 1:2 లో దేవుని ఆత్మ జలములపై అల్లాడుచుండెను (హెబ్రీ “రాకాఫ్” అంటే పొదుగు చుండెను). అందుకే కీర్తనాకారుడు ‘యెహోవా వాక్కు చేత ఆకాశములు కలిగెను, ఆయన నోటి ఊపిరిచేత వాటి సర్వ సమూహములూ కలిగెను’ అని వ్రాస్తున్నాడు (కీర్తన 33:6).
ఈ పుస్తకము చిన్నగా కనబడినా అత్యున్నతమైన దైవ జ్ఞానముతో నింపబడి ఉంది. పాత, క్రొత్త నిబంధనలో త్రిత్వ ప్రమాణం, దాని అవగాహన, త్రిత్వంపై ప్రజలో ఉన్న అనుమానాలు – వాటికి సమాధానాలు, ఇంకా ఎన్నో విషయాలు క్రోడీకరించబడ్డాయి.
రానున్నరోజుల్లో దైవ జ్ఞానంపై విశ్వాస ప్రమాణంపై అనేక గ్రంధాలను కార్నర్ స్టోన్ మినిస్ట్రీస్ వారు ప్రచురిస్తారని ఆశిస్తూ ఈ బృహత్తర గ్రంధాన్ని తెలుగు క్రైస్తవ లోకానికి పరిచయం చేయడం నాకెంతో సంతోషంగా ఉంది.
ఇట్లు
క్రీస్తు దాసుడు ప్రొఫెసర్. మనశ్షె పసుపులేటి.
M.A, M.Th, Ph .D. (English Lit.), Ph.D. (Philosophy), D.Litt.(Religion& Culture), Ph.D. (History/ Theology)

category: